Wednesday, June 20, 2007

జనవరి 14, జంధ్యాల జయంతి సందర్భంగా : "హాస్యబ్రహ్మ జంధ్యాల"


ఆయన తెలుగు తెరపై నవ్వుల నందనవనాల్ని గుబాళింపజేసిన నవ్వుల రేడు. ఆరోగ్యకరమైన హాస్యానికి అచ్చమైన స్వచ్ఛమైన నిర్వచనాన్ని చెప్పిన హాస్యబ్రహ్మ. ఎన్నెన్నో చిత్రాలతో మరెన్నో పాత్రల్ని నిరుపమానంగా సృష్టించి తెలుగుప్రేక్షకులకు నవ్వుల నజరానాలను అందించి నీరాజనాలందుకున్న హాస్య కిరీటి. నవ్వడం యోగం, నవ్వించడం భోగం , నవ్వలేక పోవటం రోగం అని నవ్వుకి ఆయన నవ్య నిర్వచనాన్ని చెప్పారు. ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన సృష్టికి ఆయన పెత్తందారు. ఆయన రూపుదిద్దిన చిత్రాలు ప్రేక్షకులకు నవ్వుల షికారులు. తెలుగు వాకిళ్ల ముందు హాస్య తోరణాలను కట్టి తెలుగువారిని నిండుగా మెండుగా నవ్వించిన్ హాస్యబ్రహ్మ ఆయన. అంతేకాదు, హాస్యకులానికి ఆయన దళపతి, హాస్యదళానికి కులపతి. ఆయనే జంధ్యాల. 1951 జనవరి 14న జంధ్యాల పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. ఆయన పూర్తిపేరు జంధ్యాల వీరవెంకట దుర్గా శివసుబ్రహ్మణ్య శాస్త్రి. ఆయన విద్యాభ్యాసం ఏలూరు, విజయవాడల్లో కొనసాగింది. కాలేజీ రోజుల్లోనే నటుడిగా, నాటక రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. "తస్మాత్ జాగ్రత్త" అనే నాటకాన్ని డిగ్రీ చదువుతున్నప్పుడే రచించి ప్రముఖుల ప్రసంశలు పొందారు. ఆ తర్వాత జీవన జ్యోతి, ఏక్ దిన్ కా సుల్తాన్, డాక్టర్ సదాశివం, మండోదరి మహిళామండలి , గుండెలు మార్చబడును వంటి నాటికలను రాసి జంధ్యాల రచయితగా తన సత్తా చాటుకున్నారు. 1974వ సంవత్సరంలో జంధ్యాల రాసిన నాటిక "సంధ్యారాగం" చెన్నైలో ప్రదర్శితమైంది. ఆ నాటికను చూసిన ప్రఖ్యాత దర్శకులు బీఎన్ రెడ్డి జంధ్యాల రచనాశైలి పట్ల ముగ్ధులయ్యారు. పుణ్యభూమి, కళ్లుతెరువు చిత్రం కోసం స్రిప్ట్ పనిని జంధ్యాలకు అప్పగించారు. ఆ చిత్రానికి కొన్ని పాటలు కూడా రాశారు. అయితే, బీఎన్ రెడ్డి ఆకస్మిక మరణం వల్ల ఆ చిత్రం నిర్మాణదశలోనే ఆగిపోయింది.
కే విశ్వనాధ్, జంధ్యాల కాంబినేషన్ ఎన్నో దృశ్యకావ్యాలకు ఊపిరిపొసింది. ఎవర్ గ్రీన్ క్లాసిక్ శంకరాభరణం చిత్రంతో పాటు సప్తపది జంధ్యాల రచనా వైదుష్యానికి తార్కాణాలు. కే.రాఘవేంద్ర రావు, జంధ్యాల జోడీ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల రూపకల్పనకి కారణమయింది. అడవిరాముడు, వేటగాడు, డ్రైవర్ రాముడు, జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి చిత్రాలను జనరంజకంగా రూపొందించడంలో జంధ్యాల కీలక భూమిక వహించారు. వేటగాడు చిత్రంలో అంత్యప్రాసల్ని అలవోకగా కదంతొక్కించి ప్రాసల బాదుషాగా తన రచనా చమత్కారాన్ని వెల్లడించారు.
ముద్దమందారం చిత్రం ద్వారా జంధ్యాల దర్శకునిగా తన విజయయాత్రను ఆరంభించారు. తన ప్రతిభకు రెండువైపులా పదను ఉందని నిరూపించుకొని దర్శక రచయితగా తన విశిష్టతను చాటుకున్నారు. ఉషాకిరణ్ మూవీస్ జంధ్యాల దర్శకత్వంలో రూపొందించిన శ్రీవారికి ప్రేమలేఖ ఎవర్ గ్రీన్ కామెడీ ఎంటర్ టైనర్. కామెడీ చిత్రాలన్నింటికీ వినూత్న ఒరవడిని, ఉరవడిని సృష్టించిన ఈ సినిమా ప్రేక్షకులను నవ్వుల జడివానలో ముంచెత్తుతుంది. ఓ పక్క హాస్య చిత్రాలను సృష్టిస్తూనే మరో పక్క ఇతర అంశాలకు చెందిన చిత్రాల రూపకల్పన చేసి మంచి కీర్తిని అందుకున్నారు. ఆనందభైరవి, నెలవంక వంటి చిత్రాలు ఇందుకు ఉదాహరణలు. జంధ్యాల రూపొందించిన ఒక్కో చిత్రం ఒక్కో విధంగా గిలిగింతలు పెడుతుంది. హాస్యరసంలో ఎన్ని కోణాలు ఉన్నయో అన్నింటినీ ఆవిష్కరించారు. ఓ చిత్రం రెండు జళ్ల సీత,మరొకటి కొంటి చూపులతో విరిచూపులతో మురిపించే ముగ్ధ, మరోటి ముడేసుకున్న ముత్తైదువ. ఇంకోటి కాళ్ళపారాణి ఆరని నవవధువు. ఇంకో చిత్రం వయ్యారాన్ని వలకబోసే నెలత. మరోటి జర్దా కిళ్లీ నవిలే జాన. ఇలా ఆయన తీర్చిదిద్దిన హాస్యచిత్రాలన్నీ వైవిధ్యంగా నవ్వులసీమలో విహరింపజేస్తాయి. జంధ్యాల పెన్ను పేపర్ మీద పెట్టగానే పెన్నుకీ పేపరుకీ చక్కిలిగింతలు మొదలౌతాయి. ప్యాడ్ ఫెళ్ళున నవ్వుతుంది. పేపర్ వెయిట్ పెదాల మాటున మందహాసం చేస్తుంది. అయన సీన్ పూర్తయ్యాక వెండితెరపై దానిని చిత్రీకరించాక కడుపుబ్బా తనివితీరా నవ్వుకోవడం ప్రేక్షకుల వంతవుతుంది.
జంధ్యాల సృష్టించే హాస్యం పదహారణాల తెలుగుపడుచులా మురిపిస్తుంది. ఆయన వండిన హాస్యవంటకంలో మసాలా మచ్చుకైనా కనిపించదు. తాజా కూరగాయలతో వండి వేడి వేడిగా అరిటాకులతో వడ్డించినట్టుంటుంది. కాస్త ఇంగువ పోపు తగిలించినట్టుగా ఘుమఘుమలాడుతుంది. జంధ్యాల ఆసీస్సులతో సత్యాగ్రహం చిత్రం ద్వారా సినీక్షేత్రంలో నాటబడిన బీజం ఈనాడు హాస్యవటవృక్షమై ప్రేక్షకుల సేద తీసుస్తోంది. ఆయనే బ్రహ్మానందం. నవ్వుల చిత్రాలు, హాస్య పాత్రలు, కామెడీ సన్నివేశాలు సృష్టించడంలో జంధ్యాలకు సాటి లేరు. భావాల సీమలో విహరించి భావాన్ని భాషతో మేళవించి హాస్యాద్భుతాన్ని ఆయన కాగితం మీద ఆవిష్కరించేవారు. ఆ సన్నివేశాలను తెరకెక్కించి ప్రేక్షకులకు గిలిగింతలు పెడతారు.
ఏఎన్నార్, చిరంజీవి, నరేష్, రాజేంద్రప్రసాద్, అలీ.. ఇలా అన్ని స్ధాయి నటులతో జంధ్యాల కలిసి పనిచేశారు. ఎన్నో ప్రాతలకు అక్షరాలు దిద్దించారు. ఆపద్భాందవుడు చిత్రంలో ఓ కవి పాత్రలో నటించి నటుడిగా తన ప్రజ్ఞని ప్రకటించారు. అలాగే డబ్బింగ్ కళాకారుడిగా ఎన్నో పాత్రలకు తన గాత్రదానం చేసి తన కళావైదుష్యాన్ని నిరూపించుకున్నారు. జంధ్యా మారుతంలా హాస్య చందన లేపనాన్ని పూసి ప్రేక్షకుల మనోసీమల్ని రంజింపజేశారు. నవ్వులు విరిసినన్నాడు జంధ్యాల అజరామరుడు..!!

7 వ్యాఖ్యలు:

Phani said...

జంధ్యాల గారి సినిమాల్లో ఏదైనా వైకల్యం గలవారిమీద చూపించే హాస్యం నాకు నచ్చదు. ఉదాహరణకు అహ నా పెళ్ళంట లో బ్రహ్మానందం, గుండు హనుమంతరావుల పాత్రలు. ఈ ఒక్క విషయాన్ని మినహాయిస్తే ఆయన ఒక హాస్యబ్రహ్మ అనేది నిస్సందేహం.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

నిజమే,జంధ్యాల సినిమాల్లో దాదాపు ఒకే పాత్ర చివరివరకూ కొనసాగింది.ఆయన మొదటి సినిమలో ఒక యజమాని పాత్ర మొహం చూడు కుంభాకార కటకం లాగా,అంటుంది ఇక అక్కడ్నుంచి ఆయన చివరి సినిమా వరకూ అదే పాత్ర ఎందరిచేతో పోషింపచేసారు.శ్రీవారికిప్రేమలేఖ,నాలుగుస్తంభాలాట,అహా నాపెళ్ళంట ఇలా ఒకటేమిటి ప్రతి సినిమాలోనూ అదే పాత్ర,పాత్ర ధారులు అప్పుడప్పుడు మారేవారు. పెద్దనటుల సినిమాలతో ఉన్నదానికి కొత్తపేరు రాకపోగా ఎంతో తడబడటం కనిపిస్తుంది.ఆయన హీరొయిన్ల గురించి సినిమా రంగంలో ఒక జోక్ ఉందంటారు.పూర్ణిమ,తులసి,మహలక్ష్మి,ఇలా వుంటారు వాళ్ళు,ఒకా పూర్ణిమ చాలా కాలం నిలబడింది.కానీ జంధ్యాలా సినిమాల్లో మూడు వంతులు చక్కగా చూసుకోవచ్చు.


రాజేంద్ర కుమార్ దేవరపల్లి

కొత్త పాళీ said...

ఆపద్బాంధవుడులో మీనాక్షి శేషాద్రి తండ్రి పాత్ర వేసింది (మీ బేనరులో కనబడుతున్న వ్యక్తి), దర్శకుడి జంధ్యాల గారి తండ్రి .. ఆయన ఉచ్చారణ అద్భుతంగా ఉంటుంది.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

ప్రవీణ్ కుమార్ గారూ మీ తెలుగు జర్నల్ కు విశాఖపట్నం నుంచి రిపోర్టరు ఎవరన్నా ఉన్నారా?

Karthik Pavan.Gade said...

@Rajendra Kumar Garu..

Na peru Karthik Pavan andi..Me vyakhyalaku na danyavadamulu munduga..inka Vizag vishayaniki vaste.. maku akkada reporter lu leru/

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

సారీ,కార్తీక్ పవన్ గారూ,మీ నెట్ వర్కు వైజాగ్ లో కావాలని ఉంటే నాకొమెయిల్ పంపండి

Karthik Pavan.Gade said...

@Rajendrakumar garu.. na mail id ivision.karthik@gmail.com
daaniki me phone number pampagalaru.. lekapote me mail ichina nenu na number istanu..we can speak directly